Friday, August 19, 2016

ఎఫ్‌డిఐలకు దాసోహం

- స్వాతంత్య్ర సమర స్ఫూర్తి విస్మరణ
                  మనమొక విచిత్రమైన కాలంలో జీవిస్తున్నాం. ఈ కాలం లో విద్రోహులు విరహగీతా లాలపిస్తున్నారు. ద్రోహులు త్యా గుల గురించి కన్నీరు కారుస్తు న్నట్లు నటిస్తున్నారు. వారి నటనా చాతుర్యానికి ఎంతటి గొప్ప నటులైనా అవాక్కై పోవాల్సిందే. తిమ్మిని బమ్మిని చేయగలమనే వారి నమ్మకానికి మనం జోహార్లర్పించాల్సిందే. గతంలో ఎవరూ సాహసించని విధంగా అన్ని రంగాలలో గుండుగుత్తగా విదేశీ పెట్టుబడు లకు ఆహ్వానం పలికేవారు స్వాతంత్య్ర సమరయోధులకు వంగివంగి సలాములు చేస్తున్నారు.

విదేశీ దోపిడీపై తిరుగుబాటు ఎందుకు?
ఒక్క ఈస్టిండియా కంపెనీ కాలుమోపింది మొదలు 200 సంవత్సరాలకు పైగా విదేశీ బానిసత్వంలో దేశం మగ్గిపోయింది. దేశ సంపదను, సహజవనరులను విదేశీ శక్తులు వివిధ రూపాల్లో దోచుకుని తరలించాయి. ఈ విదేశీ శక్తులను తరిమి స్వాతంత్య్ర సముపార్జన కోసం, బానిసత్వం నుంచి విముక్తి కోసం దేశం యావత్తూ పోరాడింది. ఎందరో వీరులు దేశం కోసం పోరాడారు. లాఠీలకు ఎదురొడ్డి నిలిచా రు. ఉరికంబాన్ని ముద్దాడారు. తుపాకి గుండు కెదురుగా గుండెలు నిలిపారు. అంతటి త్యాగాలు వారెందుకు చేశారు? మన దేశాన్ని స్వయంశక్తితో అభివృధ్ధి చేసుకొని దేశాన్ని సుసం పన్నం చేసుకొవటమే వారి ఉద్దేశం. స్వాతంత్య్ర సమరయో ధుల త్యాగాలను మోడీ ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. విదేశీ పెట్టుబడులకు మోడీ సాగిలపడినంతగా గతంలో ఎన్నడూ జరగలేదు.
ఎఫ్‌డిఐలకు గేట్లు మరింత బార్లా
2016 జులై 21న పెద్దఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డిఐ) ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గేట్లను మరింత బార్లా తెరిచింది. రక్షణ, విమానయాన, ఫార్మా రంగాల్లో సైతం నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిచ్చింది. వీటితోపాటు ఆహారోత్ప త్తుల వర్తకం, బ్రాడ్‌కాస్టింగ్‌ క్యారేజీ సర్వీసులు, ప్రయివేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు, పశు సంరక్షణ రంగాల్లో ఎఫ్‌డిఐ నిబంధనలను సడలించింది. సిగ్గు లేకుండా ''ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్‌డిఐలకు భారత్‌ అత్యంత స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా మారిందని'' ఈ సందర్భంగా మోడీ ట్వీట్‌ చేశారు.
రక్షణ రంగంలోకీ నూరు శాతం
మన దేశభక్తియుత ప్రభుత్వం రక్షణ రంగంలో ఎఫ్‌డిఐల పెంపు కోసం ప్రభుత్వ ఆయుధ చట్టం-1959కి సవరణలు చేసింది. రక్షణ రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తే దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని మనకు తెలుసు. ప్రతిపక్షంగా ఉన్న బిజెపి కీలకమైన రక్షణ రంగంలో నూరు శాతం ఎఫ్‌డిఐలకు అనుమతి సరికాదని ఆందోళనలు చేసింది. ఇప్పుడు అదే మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణలకు పచ్చజెండా ఊపింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకనీతి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక నీతి. ఇటువంటి ద్వంద్వ నీతిని మనం మున్ముందు మరెంతగా చూడాలో!
మందుల తయారీ రంగంలో...
ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల తయారీ తరువాత ఎక్కువగా లాభ శాతం వచ్చే రంగం ఫార్మా. ఈ రంగంలో కొన్ని మందులపై లాభ శాతం 2000 నుంచి 3000 శాతం వరకు ఉంటాయి. మన మందుల కంపెనీలు స్వాతంత్య్రానం తర కాలంలో అతి తక్కువ ధరకు అత్యవసర మందులం దించాయి. ఇప్పుడా అవకాశం లేకుండా పోతోంది. ఫార్మా మార్కెట్‌లో ఇక ఏ అనుమతులూ లేకుండానే భారతీయ కంపెనీలను కొని లేదా అవి తయారుచేసే బ్రాండ్లను కొని వాటిని నేరుగా అమ్ముకొని విదేశీ కంపెనీలు లాభాలు ఆర్జించుకోవచ్చు.
సింగిల్‌ బ్రాండ్‌ చిల్లర రంగం
దేశంలో నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంలో వంద శాతం పెట్టుబడులకు అనుమతించారు. సింగిల్‌ బ్రాండ్‌ చిల్లర వర్తక దుకాణాలను ఏర్పాటు చేసేవారికి స్థానిక సేకరణ నిబంధన నుంచి మూడేళ్ళపాటు సడలింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాంకేతిక ఉత్పత్తులకు చెందిన సంస్థలకైతే మరో ఐదేళ్ళపాటు స్థానిక సేకరణ నిబంధన నుంచి సడలింపునిచ్చింది. దీంతో అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో స్టోర్లను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల అడ్డంకులూ తొలగిపోయాయి.
విమానయానం
పౌర విమానయాన రంగంలోకి వంద శాతం ఎఫ్‌డిఐలను అనుమతించారు. ఇందులో 49 శాతం నేరు గానే పెట్టుబడి పెట్టవచ్చు. అంతకు మించి పెట్టుబడులు పెట్టాలనుకున్న సందర్భంలో మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన విమానా శ్రయాల్లోకి సైతం వంద శాతం విదేశీ పెట్టుబడులను నేరుగా అనుమతించనున్నారు.
ప్రయివేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు
ప్రయివేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీల్లోకి వచ్చే ఎఫ్‌డిఐల పరిమితిని 74 శాతానికి పెంచారు. ఇందులో 49 శాతం వరకు నేరుగా ఎంట్రీ కల్పించారు. ఒకవేళ 74 శాతానికి పెంచుకోవాలంటే మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 49 శాతం పెట్టుబడులకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
బ్రాడ్‌కాస్టింగ్‌ క్యారేజ్‌ సర్వీసులు
ఈ రంగంలో పలు విభాగాల్లోకి(టెలిపోర్టులు, డిటిహెచ్‌, కేబుల్‌ నెట్‌వర్క్‌, మొబైల్‌ టీవీ, హెడెన్డ్‌ ఇన్‌ ది స్కై బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీస్‌) వంద శాతం విదేశీ పెట్టుబడులకు నేరుగా ఎంట్రీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విభాగ సంస్థల్లో 49 శాతం కంటే అధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా యాజమాన్య నియంత్రణ దక్కించుకోవాలనే విదేశీ మదుపుదారులకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్‌ఐపిబి) నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఆహారోత్పత్తుల వర్తకం
దేశంలో ఆహారోత్పత్తుల తయారీని ప్రోత్సహించేం దుకు ఈ రంగంలోకి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లను అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో తయారైన ఆహారోత్పత్తులను ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లో నూ విక్రయించాలనుకునే సంస్థల్లోకి ప్రభుత్వ అనుమతితో వంద శాతం వరకు ఎఫ్‌డిఐలను చొప్పించవచ్చు.
పశు సంరక్షణ
ప్రస్తుత నిబంధన ప్రకారం ఈ రంగంలో నిర్దిష్ట షరతులకు లోబడి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంది. ఈ షరతులను సైతం మినహా యింపు ఇచ్చేసింది. గత ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం రక్షణ, నిర్మాణం, బీమా, పెన్షన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌, తేయాకు, కాఫీ, రబ్బరు, యాలకులు, పామాయిల్‌, ఆలివ్‌ ఆయిల్‌ తోటల పెంపకం, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌, తయారీ రంగం, లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌, పౌరవిమానయానం, క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు, శాటిలైట్లు, ఆస్తుల పునర్వ్య వస్థీకరణ సంస్థలకు సంబంధించిన ఎఫ్‌డిఐ నిబంధనలను సడలించింది. వీటన్నిటి సారాంశం స్వదేశీ కంపెనీల్లో విదేశీ యులు 49 శాతాన్ని మించి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. డబ్బుంటే వంద శాతం పెట్టుకోవచ్చు. అంటే ఆ కంపెనీల మీద అధికారం కూడా పొందొచ్చు! ఇక్కడి ఉత్పత్తులను మనం పెంచితే వాటిని వారు తమ దేశాలకు తీసుకొని పోవచ్చు! డబ్బులు వదిలేది మనకు, లాభాలు పొందేది విదేశీ సంస్థలు. ఇక విదేశీయులు స్వేచ్ఛగా మన దేశంలో ఆస్తులను కూడబెట్టుకోవచ్చు! అంతేకాదు నష్టపోయిన మన కంపెనీ లను మళ్లీ వారే అతి తక్కువ ధరలకు కొని తిరిగి వాటిని లాభాల్లోకి తెచ్చుకుంటారు! ఈ దేశంలో వారికి సుస్థిరత వస్తుంది!
పార్లమెంటు సాక్షిగా బరితెగింపు
''పెట్టుబడులు దాతృత్వంతో రావనీ, లాభాలు తీసుకోవద్దంటే ఎవ్వరూ పెట్టుబడులు పెట్టబోరనీ'' 2016 జులై 28న లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. విదేశీ పెట్టుబడులు ఎంత వస్తున్నాయి? పెట్టుబడిదారులు రాయితీలు, పన్నుల రూపంలో ఎంత పొందుతున్నారు? అని ఒక సభ్యుడు లెవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా జైట్లీ పై విధంగా సమాధానమిచ్చారు. ''గడచిన రెండేళ్లలో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో 53 శాతం పెరిగాయని'', ''మరింత సాఫీగా వ్యాపారం సాగేందుకు'' ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ''వారికి సహేతుకమైన పన్ను రాయితీని ప్రభుత్వం ప్రకటిం చింది'' అని ఆయన వివరించారు. ''1991 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనేక రంగాలు తలుపులు బార్లా తెరిచాయని, మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం వాటికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం మరింత సరళతరం చేస్తామని'' ఆయన పేర్కొన్నారు. దీనికోసం అవసరమైన చర్యలను పారదర్శకంగా అమలుచేస్తామని ఆయన చెప్పారు.
ఉపాధి పెరుగుదల ఉత్తదే...
తద్వారా గత ఆర్థిక సంవత్సరంలో(2015-16) దేశంలోకి వచ్చిన ఎఫ్‌డిఐ విలువ 5,546 కోట్ల డాలర్లకు (రూ.3,69,000 కోట్లు) పెరిగింది. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏడాది కాలంలో వచ్చిన ఎఫ్‌డిఐలలో ఇదే అత్యధికం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ విదేశీ కంపెనీలూ భారతదేశంలో కర్మాగారాన్ని ప్రారంభించలేదు. మరి కేంద్రం చెబుతున్నట్టు ఉపాధి ఎలా పెరుగుతుంది? ప్రభుత్వ చర్యల వల్ల భారత ప్రజలకు చేకూరే ప్రయోజనం లేకపోగా కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోవడం, వచ్చిన లాభాలను విదేశాలకు తరలించడం జరుగుతుంది. ఎఫ్‌డిఐల పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మున్ముందు ఇంకా తెలుస్తాయి. 2012లో కాంగ్రెస్‌ను నిందిస్తూ మోడీ ''ఆ పార్టీ దేశాన్ని విదేశాలకు దొడ్డి దోవన అమ్మాలని'' చూస్తుందని ట్వీట్‌ చేశారు. అదే మోడీ నేడు ఇదే దేశాన్ని నేరుగా, రాజమార్గం ద్వారా విదేశాలకు అమ్మాలను కుంటున్నారు. అంటే దొంగలు పోయి బందిపోట్లు వచ్చారన్నమాట!
ఎన్నో ఏళ్ల విదేశీ పాలనలో మగ్గి మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి ఇప్పుడు అర్థం లేకుండా పోతోంది. పరోక్షంగా మళ్లీ మనం విదేశీయుల పాలనలోకి వెళ్తున్నాం. కొంతకాలం తర్వాత అది ప్రత్యక్ష పాలన కావచ్చు. వారందరూ మొదట్లో ఇక్కడికి వచ్చింది వ్యాపారాల నిమిత్తమే. దీన్ని ఎవరూ కాదనలేరు. స్వదేశీ భక్తుల బరితెగింపుతో మన స్వాతంత్య్రా నికి వచ్చిన ముప్పు నుంచి దేశాన్ని కాపాడుకొనేందుకు మనం కదలాలి.
- కారుసాల శ్రీనివాసరావు

No comments:

Post a Comment