ఈరోజు దేశమంతా అవినీతి వ్యతిరేక ఉద్యమం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమం వల్ల ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసి అవినీతిని ధైర్యంగా ఎదుర్కొనవచ్చనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ ఉద్యమం వల్ల నీతి, నిజాయితీ గలిగిన అధికారుల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వారికి తాము అనుసరిస్తున్న విధానం సరైనదేనన్న నమ్మకం కలుగుతుంది. ఇదివరకు అటువంటి అధికారుల్లో కొంతమందికైనా తాము చేస్తున్నది సరైనదేనా అనే సంశయం ఉండవచ్చు. ఎందుకంటే అవినీతివల్ల లక్షల కోట్లు సంపాదిస్తున్న వారిని చూసి తామేదో కోల్పోతున్నామనే బాధ కొంతమందికి వుండవచ్చు. కానీ నిజాయితీగా ఉండేవారిని ఏ రోజుకైనా సమాజం గుర్తిస్తుందనే భావం, అవినీతి చర్యలకు పాల్పడేవారిని ఏనాటికైనా అసహ్యించుకుంటుందనే ఆలోచన కలుగుతుంది. ఇటీవల అవినీతికి పాల్పడిన నాయకులు, అధికారులు జైలు ఊచలు లెక్కబెడుతున్న విషయాన్ని చూస్తున్నాము. ఇది అవినీతికి పాల్పడే అధికారుల్లో భయం కలుగజేయవచ్చు. అవినీతి చర్యలకు పాల్పడరాదనే భావం కలుగవచ్చు, లేదా తాము చేసే అవినీతి పనులను మరింత జాగ్రత్తగా, ఎవరికీ తెలియకుండా చేయాలనే ఆలోచనలు కలుగవచ్చు. అవినీతి చర్యల వల్ల సమాజం ఎలా నిర్వీర్యమౌతున్నదో, ప్రజలందరూ ఎలా ఇబ్బంది పడుతున్నారో గమనించి కొంతమంది తమ పద్ధతులను మార్చుకోవచ్చు. ఏదిఏమైనా, ఇటువంటి ఉద్యమాల వల్ల నిజాయితీగా వుండేవారిలో ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది. ఇది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది.
No comments:
Post a Comment