Thursday, June 23, 2016

అందాల దృశ్య మాలిక ఊటి

         ఊటీ చెరువు ఎదురుగానే పువ్వుల గార్డెనుంది. అన్నీ నిజం పూలే అనుకుంటాం. రంగురంగుల పూలు... దేనికదే భిన్నంగా, వినూత్నంగా ఉన్నాయి. లతలు, తీగలు, లాన్లు, కలువకొలను, సీతాకోకచిలుకలు, పక్షులు అన్నీ మనముందే. వాటిని తాకితే మాత్రం ఎవరైనా సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టులవ్వాల్సిందే. ఎందుకంటే... అవన్నీ నిజమైన పూలు కాదు.

పరీక్షలైపోయాయి. గత నాలుగేళ్లుగా చదువుతో ఒక రకంగా విసుగెత్తింది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి రావాలనుకుంటున్న సమయంలో... సిపియం అఖిల భారత మహాసభలు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో జరుగుతున్నాయని తెలిసింది. మా కుటుంబ సభ్యులంతా పార్టీ మద్దతుదారులం కావటంతో ఈసారి అటువెళ్ళి రావాలనుకున్నాం. చాలా మంది రెండు నెలల ముందుగానే బస్సుల్లో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అలా వెళితే అనేక ప్రదేశాలు చూసుకుంటూ కోజికోడ్‌ వెళ్లొచ్చని, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొన్ని ప్రాంతాలు చూడొచ్చని ప్లాన్‌ చేసుకున్నారు. అన్ని రోజులపాటు బస్సుల్లో తిరగటం కష్టమని మేం ఊటీ ఒక్కటి చూసి, అక్కడ నుండి కోజికోడ్‌ వెళ్లాలనుకున్నాం. మహాసభ పూర్తయ్యాక అక్కడికి దగ్గర్లోని ప్రదేశాలు చూడాలనుకున్నాం. సహజంగానే ఊటీ
ప్రయాణమంటే ఆనందం వేసింది. మన సినిమాల్లో ఊటీ దృశ్యాలు తరచూ కనపడుతూ ఉండటం, ఆ సినిమా మొత్తం ఊటీలోనే తీశాం అని భారీగా ప్రచారం ఇస్తుండటం... ఇవన్నీ తెలిసి ఊటీ చూడాలనే ఆశక్తి ఉంది. సినీనటుడు రాజ్‌కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసి దాచిన సత్యమంగళం అడవులు ఊటీ పక్కనే ఉన్నాయి. నీలగిరి పర్వతాలలో ఉన్న ఊటీ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. నీలగిరి జిల్లా ముఖ్య పట్టణమైన ఊటీని ఉదకమండలం అని కూడా అంటారు. ఉదకమండలం అంటే నీరుగల ప్రదేశం అని అర్ధం. సముద్ర మట్టానికి 2,719మీటర్ల (8921 అడుగులు) ఎత్తులో ఉండడం వల్ల ఈ ప్రదేశం ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
ఊటీ చరిత్ర
పూర్వం నీలగిరి పర్వత ప్రాంతాలు 'చేర సామ్రాజ్యం'లో భాగంగా ఉండేవి. తర్వాత గంగరాజుల చేతికి మారాయి. 12వ శతాబ్దంలో హోయసాల వంశ రాజైన విష్ణువర్ధన్‌ సామ్రాజ్యంలో భాగమయ్యాయి. తర్వాత టిప్పుసుల్తాన్‌ ఆధీనంలో ఉండి బ్రిటీష్‌ వారి చేతిలోకి వెళ్లాయి. ఆంగ్లేయుల కాలంలో కోయంబత్తూర్‌ ప్రావిన్స్‌ గవర్నరుగా పనిచేసిన సుర్లీవాన్‌ అక్కడి వాతావరణానికి, ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై, అక్కడే నివశిస్తున్న కోయజాతులకు తక్కువ పైకం ముట్టజెప్పి ఆ ప్రాంతాన్ని కొనేశాడు. అలా ఆ ప్రాంతాన్ని బ్రిటీష్‌ వారు సొంతం చేసుకున్నారు. మద్రాసు ప్రాంతానికి ఊటీ వేసవి రాజధానిగా మారింది. క్రమంగా తమ అవసరాలకనుగుణంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఎటు చూసినా పచ్చదనం, ముచ్చట గొలిపే లోయల సౌందర్యానికి ముగ్ధులైన వారు ఊటీని 'క్వీన్‌ ఆఫ్‌ హిల్స్‌' అని పిలవటం మొదలుపెట్టారు.
మా ప్రయాణం బస్సులోనే
రైలు గురించి ముందుగా సరైన సమాచారం లేకపోవటంతో మేము కోయంబత్తూర్‌ వరకూ ట్రైన్‌లో వెళ్ళాం. అక్కడ నుండి ఉదయం 5 గంటలకు మెట్టుపాళయంకు ట్రైన్‌ ఉందని, అది ఊటీ వెళ్లే ట్రైన్‌కు అందిస్తుందని తెలిసినా ట్రైన్‌ బాగా రష్‌గా ఉంటుందని తెలిసింది. దానికి ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని చెప్పటంతో బస్సులో బయల్దేరాం. సరిగ్గా 5.15కు బయలుదేరిన మేం 6.30కు మెట్టుపాళయం చేరుకున్నాం. ఊటీ వెళ్ళటానికి ఉన్న దారుల్లో మెట్టుపాళయం ముఖ్యమైంది. నీలగిరి కొండల దిగువ భాగాన కొండలదారికి వెళ్ళేందుకు ప్రారంభమే ఈ మెట్టుపాళయం. కోయంబత్తూరు, మైసూర్‌ దారిలో ఈ పట్టణం ఉంది. ఆ విశాల పర్వతాలు ఎక్కటానికి తూర్పువైపున ఉన్న పర్వతపాదాల దగ్గరున్న మెట్టుపాళయం ఊటీకి ముఖద్వారం వంటిది. పశ్చిమ వైపు నుండి గుడలూరు మీదుగా మైసూరు నుండి కానీ , కోజికోడ్‌ నుండి గానీ ఊటీకి రావచ్చు.
నీలగిరి పర్వతాల పై బస్సు ప్రయాణం
బస్సు అనేక మలుపులు తిరుగుతూ కొండపైకి ఎక్కటం ప్రారంభించింది. నిజంగా జీవితంలో ఒక్కసారైనా చూసితీరాల్సిన ప్రదేశం ఇది. ఈ పచ్చ బంగారులోకం నిలువెల్లా అద్భుత దృశ్య కావ్యమే. వేసవిలోనే కాదు, ఏ కాలంలోనైనా ఇక్కడి ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవచ్చు. నవదంపతుల నుండి వయోవృద్ధుల వరకూ ఇక్కడి అందాలకు పరవశించి పోతారు. అందమైన తోటలు, రంగురంగుల పూలు, టీ, కాఫీ తోటలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ప్రకృతి సహజ సౌందర్యం దారి పొడవునా అలరిస్తుంది. పొడవాటి ఫైన్‌ వృక్షాలకు ఈ ప్రాంతం ఆలవాలం. నాలుగు గంటల ప్రయాణం... అందునా 2.30 గంటల ఘాట్‌రోడ్డు ప్రయాణం తరువాత ఊటీ చేరుకున్నాం.
ఊటీలో విహారం
కొంచెం రేటు ఎక్కువైనా ఊటీలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. బస్సు, రైళ్ళు దిగిన వెంటనే ప్రభుత్వ గుర్తింపు పొందిన ట్రావెల్‌ ఏజెంట్లు మన దగ్గరకే వస్తారు. వాహనాల విషయం, ఉండటానికి హోటళ్ల విషయాలు మొత్తం వారే వివరిస్తారు. ఆ రోజంతా తిరగటానికి 10 ప్రాంతాల ప్యాకేజీ ఒక దాన్ని ఎంపిక చేసుకుని వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యాం. 20 మంది పట్టే వ్యాన్‌లో ప్రయాణం. డ్రైవర్‌ అండ్‌ గైడ్‌ ఒకరే. ప్రతి ప్రాంతం దగ్గరికి చేరిన వెంటనే, ఆ ప్రదేశం ప్రాధాన్యతను హిందీ, ఇంగ్లీషులో వివరించి, ఫలానా సమయానికి రావాలని పార్కింగ్‌ ప్లేస్‌ చెప్పి పంపిస్తాడు గైడ్‌ కం డ్రైవర్‌.
ఊటీలేక్‌ బోటు విహారం
ఊటీ బస్టాండ్‌ పక్కనే పెద్ద చెరువు. ఎత్తైన ఫైన్‌ చెట్ల మధ్య ఉన్న ఈ చెరువులో మనమే స్వయంగా కాళ్ళతో తొక్కుతూ కాని, బోటును నడిపే వాళ్ళ ద్వారా కానీ ఇందులో విహరించటం ప్రత్యేకమైన అనుభూతి. లాహిరి లాహిరి లాహిరిలో... అనుకుంటూ ఇందులో ప్రయాణించవచ్చు. అందుకు తగిన రుసుం చెల్లించాలి. చెరువు ఒడ్డునే గుర్రపుస్వారీ, పిల్లల కోసం రైలు ప్రయాణం ఉన్నాయి.
థ్రెడ్‌ గార్డెన్‌
ఊటీ చెరువు ఎదురుగానే పువ్వుల గార్డెనుంది. అన్నీ నిజం పూలే అనుకుంటాం. రంగురంగుల పూలు... దేనికదే భిన్నంగా, వినూత్నంగా ఉన్నాయి. లతలు, తీగలు, లాన్లు, కలువకొలను, సీతాకోకచిలుకలు, పక్షులు అన్నీ మన ముందే. వాటిని తాకితే మాత్రం ఎవరైనా సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టులవ్వాల్సిందే. ఎందుకంటే అవన్నీ నిజమైన పూలు కాదు. దారాలతో తయారయ్యాయని చెప్తే కానీ తెలుసుకోలేనంతగా భ్రమకు లోనవుతాం. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి ప్రదర్శన లేదని వారు చెపుతున్నారు. కేరళలోని ఒక టీచర్‌ దీన్ని ప్రారంభించారని, అది అనేక మంది మహిళల కష్టానికి ప్రతిఫలంగా నిలిచిందని నిర్వాహకులు వివరించారు.
ఎత్తైన శిఖరం
నీలగిరి జిల్లాలోకెల్లా ఎత్తైన ప్రదేశం దొడ్డబెట్ట. ఇక్కడి నుండి చూస్తే కర్నాటక తమిళనాడు బోర్డరు, తమిళనాడు కేరళ బోర్డరు కనిపిస్తాయి. మూడు ప్రాంతాలు కలిసే ప్రాంతాన్ని టెలిస్కోప్‌ ద్వారా చూపిస్తారు. అక్కడ సాయంత్రం 5 గంటలకే విపరీతమైన చలి.
కొండ పైనుండి...
ఊటీ నుండి కూనూరు వెళ్లే దారిలో ఒక మలుపు వద్ద ఉన్న లోయ దగ్గర ఆగి చూడటం గురించి చెప్పాలి. నిట్టనిలువుగా ఉన్న ఈ లోయలోకి ఒంగి చూడాలంటేనే భయం వేస్తుంది. లోయ కింద రైల్వే ట్రాక్‌, పచ్చని టీ తోటలు... కొండవాలు చెక్కి కట్టిన ఇళ్లైతే అగ్గిపెట్టెలు పేర్చినట్టుగా ఉంటాయి. ఒక కొండవాలులో కట్టిన ఇళ్లన్నింటికీ ఒడాఫోన్‌ రంగు గుర్తులు వేసి ఉన్నాయి. వందల ఇళ్లు ఒకే వరుసలో కట్టి ఉండటంతో కొత్తరకం ప్రచారంగా మారింది. దీన్నే వ్యాలీవ్యూ అంటారు.
మిలటరీ ఆధీన ప్రదేశం
కన్నూరు దారిలో మద్రాసు రెజిమెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ మీదుగా తీసుకెళ్లారు. నాలుగైదు చోట్ల 'రోజా' సినిమా షూటింగ్‌ జరిగిన ప్రాంతాన్ని బస్సులోనే ఉండి చూడొచ్చు. అది మిలటరీ ప్రదేశం కనుక ఆగకుండా వెళ్ళాలి. బస్సు స్లోగా పోతుంటే ఈ ప్రాంతాన్నంతా చూశాం. మేము వెళ్లిన సమయంలో గుర్రాల మీద శిక్షణ పొందుతున్న బ్యాచ్‌ ఒకటి ఎదురైంది. అన్ని గుర్రాలను సినిమాల్లో తప్పితే విడిగా చూడలేం. స్వారీ చేస్తూ వెళ్తున్న దృశ్యం బాగుంటుంది.
టీ ఎస్టేట్లు
దారి పొడవునా టీ ఎస్టేట్లే. వాటిలో చాలా వరకు సినిమా తారలు కొన్నారని చెప్పారు. టీ పొడి తయారయ్యే ఫ్యాక్టరీని కూడా దూరం నుండే చూపించారు. టీ తోటల పక్కన ఆపి కొన్ని ఆకులు కోసి ఏ ఆకు నాణ్యమైన టీకి పనికొస్తుందో వివరించారు. కొండలంతా వరలు వరలుగా టీ తోటలు. మధ్యలో ఎత్తైన ఫైన్‌, జామాయిల్‌ చెట్లతో... మరో లోకంలో విహరిస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడే ఒక కొండ చివరి భాగంలో సూసైడ్‌ స్పాట్‌ ఉంది. అక్కడ నుండి నిట్టనిలువు లోయ, దూరంగా కోయంబత్తూరు మెట్టుపాళయం కట్టడాలను సూక్ష్మ దర్శిని ద్వారా చూడొచ్చు.
షాపింగ్‌ సెంటర్‌
ఊటీ, కన్నూరు దారిలో అనేక షాపింగ్‌ సెంటర్లు ఉన్నాయి. అన్ని రకాల టీ పొడులనూ కొనుక్కోవచ్చు. అనేక ఆయుర్వేద వనమూలికల మందులు కూడా ఈ షాపుల్లో దొరుకుతాయి.
చూడాల్సిన ఇతర ప్రదేశాలు
ఊటీలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. రోజ్‌ గార్డెన్స్‌, బొటానికల్‌ గార్డెన్‌, కామరాజ్‌ సాగర్‌ డామ్‌, పెరియార్‌ డామ్‌, వాటర్‌ ఫాల్స్‌, ఫారెస్ట్‌ లాంటి ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. మొత్తం చూడాలంటే కనీసం రెండు రోజులు పడుతుందని అర్ధమైంది. సాయంత్రానికి ఊటీ బస్టాండ్‌కు చేరి, 4 గంటల ప్రయాణం తర్వాత కోయంబత్తూరు చేరుకున్నాం. ఈ యాత్రలో కనపడే ప్రకృతి దృశ్యాలు ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. పచ్చదనం కరువై, రొటీన్‌ జీవితం నుండి బయటపడి కొత్త ఉత్సాహాన్ని పొందాలనుకునేవారు తప్పక చూడాల్సిన ప్రదేశం ఊటీ.
రైలుకు వెళ్ళాలనుకుంటే
మద్రాసు నుండి ప్రతి రోజు రాత్రి మెట్టపాళయం రైలు 9గంటలకు ఉంటుంది. మరుసటిరోజు ఉదయం 6.15కు అదే రైలు మెట్టుపాళయం చేరుతుంది. అక్కడి నుండి ఊటీకి ఇంకో ట్రైన్‌ ఉదయం 7.45కి ఉంది. అది ఊటీకి మధ్యాహ్నం 12.10కి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.10కి బయలుదేరి 6.30కి మెట్టుపాళయం చేరుతుంది. అలాగే ఊటీ నుండి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న కన్నూరు నుండి ఉదయం 9.30కి, మధ్యాహ్నం 2.55కి, సాయంత్రం 6 గంటలకు మూడుసార్లు ఊటీ ట్రైన్‌ ఉంది. అదే ట్రైన్‌ తిరిగి ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, 3 గంటలకు కన్నూరు వస్తుంది. ఈ ట్రైన్‌ ప్రత్యేకంగా పర్యాటకుల కోసం నడుస్తుంది. నీలగిరి పర్వతాలలోని ప్రకృతి అందాలకు, పచ్చని ప్రకృతికి ఆలవాలైన ఈ పర్యాటక ప్రాంతాన్ని రైల్‌లోంచి చూసి తీరవలసిందే.
ఊటీకి దారులు
ఊటీ మద్రాసుకు 535, బెంగుళూరుకు 290, కోజికోడ్‌కు 187, మైసూరుకు 160, కోయంబత్తూరుకు 89 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కవ మంది కోయంబత్తూర్‌, మైసూర్‌ నుండి వస్తుంటారు. కోయంబత్తూరు నుండి ఊటీకి ప్రతి 20 నిమిషాలకొక బస్సు ఉంది. ఈ బస్సులు వయా మెట్టుపాళయం మీదుగా వెళతాయి. బెంగుళూరు, మైసూర్‌ల నుండి కూడా బస్సులుంటాయి. కోజికోడ్‌ నుండీ రావచ్చు. ఏడు గంటలు బస్సు ప్రయాణం చేయాలి.
- ఆదివారం అనుబంధం - డా|| ఎ. భవిష్య, ఒంగోలు.  

No comments:

Post a Comment