Monday, June 20, 2016

యోగా శాస్త్రీయమా?

            భారత ప్రభుత్వం ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ సర్క్యులర్‌ ను వివిధ ప్రభుత్వకార్యాలయాలకు పంపింది. ప్రభుత్వ కార్యాలయాలు యోగా దినోత్సవాన్ని పాటించమని, అందులో ఉద్యోగులు పాల్గొనేలా ప్రోత్సహించమని క్రింది స్థాయి కార్యాయాలకు సర్క్యులర్‌ జారీ చేశాయి. భారత రాజ్యాంగం ప్రకారం శాస్త్రీయ విధానాలను ప్రచారం చేయటం ప్రభుత్వం విధి. మరి యోగా శాస్త్రీయమా?
యోగ అన్నది యుగ్‌ అన్న సంస్కృత ధాతువు నుండి ఏర్పడినది. సంస్కృతంలో యుగ్‌ అంటే కలయిక అని అర్ధం. యోగము అనేది వ్యాయామము, ఆధ్యాత్మిక విషయాల కలయిక. నిఘంటువుల ప్రకారం యోగము అనగా జాతకం, అదృష్టం, కలయిక, ఉపాయం, కవచం, ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయటం అనే అర్ధాలున్నాయి. యోగాసనం అనగా నిశ్చల ధ్యానానికి తగిన ఆసనం అని అర్ధం. ఇక ధ్యానం అనగా తలపోయటం, చింతించటం, పరమాత్మను తలచడం, మనసును ఏకాగ్రంగా ఉంచటం అని అర్ధాలున్నాయి.
యోగ శాస్త్రాన్ని రచించిన పతంజలి కూడా యోగం అంటే చిత్తవృత్తిని నిరోధించే మార్గము అని నిర్వచించాడు. చిత్తవృత్తి అంటే మనసుకున్న చంచల స్వభావం. చంచల స్వభావమనేది జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడుతుందని, అందువలన మనసుకున్న చంచల స్వభావాన్ని నియంత్రించేది యోగము అంటాడు పతంజలి. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానాన్ని నియంత్రించటమన్న మాట. ముందుగా ఈ అర్ధాలను, నిర్వచనాలను పరిశీలిస్తేనే అందులో ఆధ్యాత్మిక విషయాలున్నాయన్న విషయం స్పష్టమవుతున్నది. ఈ ఆధ్యాత్మిక విషయాలు కూడా హిందూమతానికి సంబంధించినవేతప్ప మరోమతానికి సంబంధించినవి కావు. ఏ మతానికి సంబంధించినవైనా ఆధ్యాత్మిక విషయాలు శాస్త్రీయం కానేరవు. ఒక మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలను మరోమతం వారి మీద, ఏమతాన్ని ఆచరించని వారిమీద రుద్దటం రాజ్యాంగ విరుధ్ధం. 
ఒక రెండవది వ్యాయామం. ఆధ్యాత్మిక విషయాలను ప్రక్కన పెడితే ఇందులో వ్యాయామం కూడా ఉందికదా? దానిని తీసుకోవటంలో తప్పేంటి? అనే వారూ ఉన్నారు. ప్రతివ్యాయామానికీ ఒక లక్ష్యం ఉంటుంది. ఒక శాస్త్రీయత ఉంటుంది. ఇటీవలి కాలంలో ఫిజియోధెరఫీ అనేది వైద్యశాస్త్రంలో భాగంగా అభివృధ్ధి చెందింది. రోగి యొక్క అవసరాన్నిబట్టి ఎలాంటి వ్యాయామం చేయాలో ఫిజియోధెరఫీ డాక్టరు సూచిస్తాడు. ఇష్టారాజ్యంగా వ్యాయామం చేస్తే రోగం పెరుగుతుంది. అందువలన వ్యాయామం చేయాల్సిన పధ్ధతులను శాస్త్రీయంగా నేర్పుతారు. ఇక త్రివిధ దళాలలకు చెందిన సైనికులకు సిబ్బందికి, డ్రిల్లు ఉంటుంది. వాటి లక్ష్యం శత్రువును ఎదుర్కొనేటందుకుగల దేహదారుఢ్యాన్ని పెంపొందించడం. అదేవిధంగా పోలీసులకు డ్రిల్లు ఉంటుంది. దాని లక్ష్యంకూడా దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవటమే. ఇక పిల్లలకు పాఠశాలలో డ్రిల్లు ఉంటుంది. క్రీడలు ఉంటాయి. అవి పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగటానికి దోహదపడతాయి. అదేవిధంగా కొంతమంది వ్యాయామశాలలకు (జిమ్‌లకు) వెళ్లి వ్యాయామం చేస్తూ ఉంటారు. వ్యాయామం కోసం వ్యాయామ శాలకు వచ్చిన వ్యక్తి ఏలక్ష్యంతో వ్యాయామం చేయాలనుకుంటున్నాడో తెలుసుకొని అక్కడి శిక్షకుడు ( ట్రైనర్‌) తగిన వ్యాయామాన్ని వారికి సూచిస్తాడు. అందువలన ప్రతి వ్యాయామానికీ ఒక లక్ష్యం ఉంటుంది. 
             మరి యోగంలో జరిగే వ్యాయామానికి ఏలక్ష్యంలేదా అంటే ఉంది. దీని లక్ష్యం ఆధ్యాత్మిక అంశాలను వ్యాయామం ద్వారా ప్రబోధించడం. ఆధ్యాత్మిక అంశాలే అశాస్త్రీయమైనప్పుడు, దానికోసం జరిగే వ్యాయామం కూడా అశాస్త్రీయంగానే ఉంటుంది. ఉదాహరణకు యోగా లో అనేక ఆసనాలలో వెన్నెముకను విల్లులా వెనుకకు వంచుతారు. కాని అది వెన్నెముకను అలా ఇష్టారాజ్యంగా వంచకూడదని అది శరీరానికి నష్టమని వైద్యులు చెప్పేదానికి ఇది విరుధ్దం. ఎందుకంటే మానవుడు జంతువునుండి మనిషిగా రూపుదిద్దుకున్నప్పుడు కటివలయం మీద ఉదరం మరియు ఛాతీ భాగాలను, తలను నిలపటానికి, తలనుండి శరీర భాగాలకు బోధక, ప్రవర్తక నాడులను అందించడానికి జరిగిన ఏర్పాటే వెన్నెముక. కటివలయం పైభాగాన ఉన్న అవయవాలన్ని వెన్నెముకను ఆధారం చేసుకొని నిలచి ఉంటాయి. అలాంటి వెన్నెముకను ఇష్టారాజ్యంగా వంచితే వెన్నెముకతోబాటుగా, నాడీవ్యవస్థకూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే అలా వంచటం అశాస్త్రీయం.ఇలాంటి అశాస్త్రీయమైన అంశాలు యోగాలో అనేకం ఉన్నాయి. ఇక యోగా చేయటంవలన అనేక రోగాలు నియంత్రించబడతాయని చెప్పటం బూటకం. ఎందుకంటే యోగా చేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారిని చూస్తేనే ఈ విషయం అర్ధం అవుతుంది. 
వ్యాయామానికీ, దేహ ఆరోగ్యానికీ, మానసిక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉన్నదన్నది యదార్ధం. ఈ వాస్తవాన్ని ఆధారంగా చేసుకొని, యోగాలో చెప్పిందికూడా అదేనని జనానికి బోధిస్తుంటారు. జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడే జ్ఞానం చంచల స్వభావం కలిగి ఉంటుందని, అటువంటి చంచల స్వభావాన్ని నియంత్రించి, మనిషిని అంతర్ముఖుడుగా చేయటమేనని యోగా చెబుతున్నది. ఇది అశాస్త్రీయం. ఎందుకంటే మనిషికి జ్ఞానం జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే ఏర్పడుతుంది. మరో మార్గంలేదు. అలాంటిది జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని నియంత్రించటం అంటే మన జ్ఞానానికి మనమే పరిమితులు విధించుకోవడం లేదా జ్ఞాన శూన్యులుగా మారటం జరుగుతుంది. ఇక జ్ఞానానికున్న చంచల స్వభావం అనేది ప్రాధాన్యతలను ఎంచుకోలేని మనస్థత్వం. జ్ఞానాన్ని నియంత్రించటం ద్వారా ప్రాధాన్యతలను ఎంచుకోవటం కుదరదు. కనక ప్రజలకు నేర్పవలసింది జ్ఞానాన్ని నియంత్రించటం కాదు. విస్తృతంగా మన మెదడుకు అందుతున్న జ్ఞానంలోనుంచి ప్రాధాన్యతలను ఎలా ఎంచుకోవాలన్నది నేర్పాలి. దానివలననే మానవుడు చైతన్యవంతుడు కాగలడు. అనేక ఘనకార్యాలు సాధించగలడు. నిజానికి వ్యాయామంవలన జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడే జ్ఞానం సునిశిత మవుతుంది. ఇది ఋజువైనది. అందుకే అది శాస్త్రీయం. జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడే జ్ఞానం సునిశితమైతే మానవునికి ప్రయోజనం. జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడే జ్ఞానాన్ని నియంత్రిస్తే అది మూఢత్వమవుతుంది. అందుకే యోగా అశాస్త్రీయం. 
ఇక యోగాలో మరో ప్రధానమైన అంశం ధ్యానం. ధ్యానం అంటే మనసును ఏకాగ్రంగా ఉంచటం. ఈ ప్రపంచంలో అనేక బాధలు మానవుని చుట్టుముట్టుతున్నాయి. వాటినన్నింటి మనసులోకి రానివ్వకుండా బిందు స్వరూపుడైన పరమాత్మపై మనసును లగ్నం చేయటాన్ని ధ్యానమని యోగాలో చెబుతారు. బాధలను మనసులోకి రానివ్వకుండా పరమాత్మపై మనసును లగ్నం చేస్తే మానవుల బాధలు తీరవు. బాధలను అర్ధం చేసుకొని, బాధలయొక్క మూలాలపై మనసు కేంద్రీకరించి వాటిని మార్చటానికి కృషిచేయటంద్వారా మాత్రమే మానవుల బాధలు తీరతాయి. ఇది తరతరాలుగా ఋజువైన విషయం. కనుక ధ్యానం కూడా అశాస్త్రీయమే. 
నిజంగా ప్రభుత్వం భారతీయులను ఆరోగ్యవంతులుగా చేయాలనుకుంటే, దానికి ఉపయోగపడే వ్యాయామాలను ప్రోత్సహించాలి. పిల్ల్లలకు పట్టణాలు నరకకూపాలుగా మారుతున్నాయి. ఆడుకోవటానికి స్థలాలు లేకుండా పోతున్నాయి. పాఠవాలల్లో సైతం ఆటస్థలాలు లేవు. దేశ వ్యాపితంగా పిల్లలకు ఆడుకోవటానికి ఖాళీస్థలాలలను అందుబాటులో ఉంచాలి. ప్రతి పాఠశాలలో ఆటస్థలం విధిగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. సుశిక్షితులైన శిక్షకులతోకూడిన వ్యాయామ శాలలను ఏర్పాటుచేయాలి. గతంలో ఉద్యోగులకు క్లబ్‌లు ఉండేవి. అందులో కొన్ని క్రీడలను ప్రోత్సహించేవి. అలాంటి క్లబ్‌లను దేశవ్యాపితంగా ఏర్పాటుచేయాలి. చదువుల్లో, ఉద్యోగాల్లో క్రీడలు అన్నవి తప్పనిసరి చేయాలి. 
           ఇవి చేయటానికి బదులుగా కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. దీని లక్ష్యం ఒక్కటే. యోగాను భారతీయ సంస్కృతిగా ఆమోదింపజేయటం. యోగాను భారతీయ సంస్కృతిగా ఆమోదింపజేస్తే, దానితో కలిసి ఉన్న హిందూ మత భావజాలానికి కూడా ఆమోదం లభిస్తుంది. భారత దేశాన్ని హిందూ మతదేశంగా మార్చాలన్న ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రయత్నాలకు అధికారంలో ఉన్న బి.జె.పి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలలో ఇదికూడా ఒక చర్య. ఆరోగ్యంగా ఉండాలన్న ప్రజల ఆకాంక్షను అడ్డు పెట్టుకొని, సంస్కృతి పేరుతో ఆడుతున్న నాటకం. 
             నిజానికి యోగా భారతీయులందరి సంస్కృతి కాదు. జనాభాలో అత్యధికంగా ఉన్న వ్యవసాయపనులు చేసేవారికి, చేతివృత్తులవారికి, మహిళలకు ఒక్కమాటలో చెప్పాలంటే శ్రమచేసేవారికి యోగా ప్రత్యేకంగా చేయనక్కరలేదు. అందుకే తరతతరాలుగా అత్యధిక జనాభాగా ఉన్న ఈ సెక్షన్లు యోగాకు దూరంగా ఉన్నారు. యోగాను నేర్చుకోవాలని ఈ సెక్షన్లు ఏయాడూ భావించలేదు. శారీరక శ్రమ చేయని వారికే యోగా అవసరం. అలా శారీరక శ్రమ చేయనివారు, ఉత్పత్తిలో పాల్గొనకుండా ఉ్పత్పత్తిని అనుభవించేవారికోసం ఏర్పాటు చేసుకున్న వ్యాయామానికి, ఆధ్యాత్మికత జోడించి యోగాగా ప్రచారం చేస్తున్నారు. అదే భారతీయ సంస్కృతిగా ప్రజలచేత అంగీకరింప జేస్తే, ఉత్పత్తిలో పాల్గొనటం ద్వారా శ్రమ చేయటంకన్నా, ఉత్పత్తితో సంబంధంలేకుండా జీవించేవిధానానికి ప్రతిఘటన లేకుండా చేసుకోవచ్చు. అందుకే యోగాను కోట్లు ఖర్చుపెట్టి అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుతున్నారు. వివిధ యంత్రాల రాకతో, వ్యాపారాలు, ఉద్యోగాల పెరుగుదలతో, శారీరక శ్రమకన్నా మానసిక శ్రమ పెరగటం, జీవన విధానం అస్తవ్యస్తంగా మారుతున్న నేటి రోజులలో సహజంగానే ఇది మధ్యతరగతిని ఆకర్షిస్తుంది. ఈ పరిస్థితులలో శాస్త్రీయమైన వ్యాయామాన్ని ప్రోత్సహించడానికి బదులుగా, యోగాను ప్రోత్సహిస్తే హిందూ మత భావజాలాన్ని ప్రజలలో చొప్పించవచ్చు. 
            అశాస్త్రీయమైన యోగాను ప్రజలపైరుద్దాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకించాలి. రాజ్యాంగబధ్ధంగా శాస్త్రీయమైన వ్యాయామాన్ని ప్రోత్సహించమని డిమాండు చేయాలి. ప్రజలకు అవసరమైన వ్యాయామాలను ప్రోత్సహించటం కోసం, ఆటస్థలాలలు, క్రీడలను ప్రోత్సహించేవిధానాలకోసం పోరాడాలి. చదువుల్లో, ఉద్యోగాల్లో క్రీడలు తప్పనిసరి చేయమని డిమాండు చేయాలి. ఇవి జరిగితేనే మనం ఆరోగ్యవంతమైన భారతాన్ని చూడగలం.

No comments:

Post a Comment