కార్మికులు సృష్టించిన కాఫీ హౌస్
ఆదివారం అనుబంధం - కారుసాల శ్రీనివాసరావు
Sat, 15 Dec 2012, IST
కేరళలో కాఫీ, టీ తాగాలని అనిపించినా, అల్పాహారం తినాలనిపించినా, లంచి, డిన్నరే చేయాలని అనిపించినా ... వెంటనే గుర్తుకు వచ్చేది 'ఇండియన్ కాఫీ హౌస్'. కేరళ ప్రజల జీవితాలతో అంతగా మమేకమైన సంస్థ 'ఇండియన్ కాఫీ హౌస్'. తక్కువ ధరకే నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించడం అక్కడి ప్రత్యేకత.
తిరువనంతపురంలోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ మధ్య ఇటుక రాయి రంగుతో చిత్రమైన కట్టడం ఒకటుంటుంది. మన చిట్టిల్లు లాంటిది. పెద్ద పొగ గొట్టం లాగా ఠీవిగా నిలబడి మనల్ని ఆహ్వానిస్తుంది. అక్కడ అల్పాహారం తినటం గొప్ప అనుభూతి. లోపలికి వెళ్లిన వెంటనే ఎదురుగా క్యాష్ కౌంటర్. కౌంటర్ వెనక కేరళ ప్రజల ప్రియతమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అగ్రనాయకులు ఎ.కె గోపాలన్ ఫొటో కనిపిస్తుంది. అది 'ఇండియన్ కాఫీ హౌస్' తిరువనంతరపురంలో ఒక బ్రాంచి. అ నగరంలోనే కాఫీ హౌస్‌కు సంబంధించి పది బ్రాంచీలున్నాయి. బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్ మధ్య ఉన్న ఈ బ్రాంచి కొంత విచిత్రమైనది. కొండ పైకి ఎక్కటానికి మెట్టు మెట్టుగా పైకి కట్టినట్లు దాన్ని నిర్మించారు. ప్రతి మెట్టుకు ఒక టేబుల్ కింద వాష్ బేసిన్. ఒక్కో మెట్టెక్కతూ మన కిష్టమైన మెట్టు దగ్గర అరుగును ఎంచుకుని కూర్చోవచ్చు. వెంటనే వెయిటర్ ప్రత్యక్షం అవుతారు. వెయిటర్ అంటే వెయిటరే కాదు, ఓనర్ కూడా అతనే. తెల్లటి కోటు, నడుముకు ఆకుపచ్చ బెల్టు, నెత్తిన మహరాజా టోపీ ఉంటుంది. మనం దారి తప్పి 5 స్టార్ హోటల్‌కు వచ్చామా అనుకుంటాం. అదేం కాదు. ఇండియన్ కాఫీ హౌస్ వెయిటర్ యూనిఫామ్ అది. మనం ఆర్డరు చెప్పక ముందే వేడినీళ్లు అందిస్తారు. కొద్దిగా ఎరుపురంగు తిరిగిన నీళ్లు సెగలు కక్కుతూ ఉంటాయి. అవి ఎందుకు అలా ఉన్నాయని అనుమానం వస్తుంది. అయితే కేరళ ప్రజలందరికి పరిచయమైన 'పొదుముగం'ను ఆ నీళ్లలో వేస్తారు. అందుకే వాటి రంగు అలా వుంటుంది (కేరళ అంతటా నీళ్లు కాచుకొని పొదుముగం అనే చెట్టు బెరడును అందులో వేసుకోవడం అలవాటు).
ఇండియన్ కాఫీహౌస్ కథ
1940 లో బ్రిటిష్ వాళ్లు భారత దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో కాఫీ బోర్డు సంస్థ 'ఇండియన్ కాఫీ హౌస్' పేరుతో అనేక చోట్ల హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించింది. 1950 వరకు కొనసాగిన ఈ సంస్థను మూసివేసి కార్మికులందరినీ డిస్మిస్ చేసింది యాజమాన్యం. పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం ఉపాధి కోల్పోయింది. తమ ఉపాధిని నిలబెట్టుకోవడం కోసం కార్మికవర్గం పోరాడింది. ప్రముఖ కమ్యూనిస్టు, కార్మిక నాయకుడు ఎ.కె.గోపాలన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
కార్మికులు తామే ఈ సంస్థలను నడపాలనే ఆలోచన నుండి వచ్చిందే 'ఇండియన్ కాఫీ బోర్డు వర్కర్స్ కో ఆపరేటివ్ సొసైటీ'. కార్మికులను సంఘటితం చేసి వివిధ పట్టణాలలో సొసైటీలను ఏర్పాటుచేశారు. కేరళలోని వివిధ పట్టణాలలో ఈ సొసైటీలు ఏర్పడ్డాయి. ఢిల్లీ, బెంగుళూరు నగరాలలోని కార్మికులు కూడా ఈ సొసైటీలను నిర్మించుకున్నారు. ఈ పనికి ప్రధానంగా కేరళ కార్మికులే కేంద్రంగా ఉన్నారు. 1958 ఫిబ్రవరి 10న 'త్రిసూర్' కేంద్రంగా రిజస్టర్ అయిన సొసైటీ 1958 మార్చి 8 మొదటి 'ఇండియన్ కాఫీ హౌస్'ను ఎ.కె.గోపాలన్ ప్రారంభించారు.
ప్రస్తుతం కేరళలో 'ఇండియన్ కాఫీ హౌస్' పేర సుమారు 50 హోటళ్లు నడుస్తున్నాయి. తిరువనంతపురంలోని ప్రభుత్వ సచివాలయం, శాసనసభ్యుల క్వార్టర్, శాసనసభ ప్రాంగణం ప్రభుత్వ వైద్యశాల, విశ్వవిద్యాలయ ప్రాంగణం తదితర ప్రాంతాలతో పాటు తిరువనంతపురం లోనే 10 సెంటర్లు నడుస్తున్నాయి.
అందుబాటులో ధరలు
ఇండియన్ కాఫీ హౌస్‌లో ధరలు అందుబాటులోనే ఉంటాయి. సింగిల్ ఇడ్లీ రూ.6లు, చపాతి రూ.3, పరోటా రూ.8, పూరి రూ.5, కర్రీకి అదనపు ధర ఉంటుంది. మనకు ఇష్టమైన కూర ఎంపిక చేసుకోవచ్చు. బ్లాక్ టీ రూ.6, బ్లాక్ కాఫీ రూ.8, భోజనం రూ.22, నేతి దోశ రూ.25లు, మసాలా నేతి దోశ రూ.37, మసాలా దోశ రూ.32 ఉంటుంది.
వినియోగదారుల సేవా అవార్డు
2008 వ సంత్సరపు వినియోగ దారుల ఉత్తమ సేవా అవార్డును ఇండియన్ కాఫీ హౌస్ గెలుచుకుంది. నీల్సన్ కంపెనీ పరిశీలనలో వినియోగదారులు ఎంచుకునే అత్యుత్తమ బ్రాండ్‌గా ఇండియన్ కాఫీ హౌస్ నిలిచింది.
No comments:
Post a Comment