ఆహ్లాదం ... అరకు ప్రయాణం ...
సొరంగ మార్గం ద్వారా రైలు ప్రయాణం కొత్తగా ఉంది. విశాఖపట్నం నుండి 'బొర్రా' వెళ్లే దారిలో రైలు అనేక సొరంగాల ద్వారా సాగిపోతుంది. కేవలం ఆ కొద్ది సమయాన్ని ఆస్వాదించడానికే పర్యాటకులందరూ రైలు ప్రయాణానికి పోటీ పడతారని అర్ధమైంది. బొర్రా చేరడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. అక్కడే ముప్పాతిక భాగం ప్రయాణీకులు దిగేశారంటే ఆరైలు ప్రయాణానికి ఎంత విశిష్టత ఉందో అర్థం చేసుకోవచ్చు. బొర్రా రైల్వే స్టేషన్నుండి ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు తిప్పడానికి చాలామంది కార్లు, జీబులతో సిద్ధంగా ఉన్నారు. వారందరూ ముందే కలిసి నిర్ణయించుకున్న ధరల ప్రకారం 350 రూపాయల చొప్పున కట్టవలసిందిగా సూచించారు. అలాగే మేం కూడా ఒక క్వాలిస్ వాహనంలో ఆరుగురు ప్రయాణీకులతో ఆ ప్రాంత విశేషాలను, అందాలను ఆస్వాదించడానికి పయనమయ్యాం. మొదటగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బొర్రా గుహల వద్దకు తీసుకెళ్లారు. ఆ గుహల్లోకి మధ్యాహ్నం రెండు గంటల వరకే అనుమతి ఉండడంతో త్వరగా చేరుకున్నాం.
బొర్రా గుహలు
బొర్రా రైల్వే స్టేషన్నుండి వెనక్కు రైలు కట్టమీదనే వెళ్తే గేటు. 40 రూపాయల టికెట్ ధర చెల్లించి గేటు దాటి లోపలికి వెళ్తే అందమైన ప్రకృతి దృశ్యం. ఎదురుగా ప్రవహిస్తున్న గోస్తనీ నది. మెలికలు తిరుగుతూ తెల్లనిరాళ్ల మీద జాలువారుతుంది. మెట్లమీదుగా కిందికి దిగితే గుహ ముఖద్వారం. ఇటీవలే లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లుగా శిలాఫలకం. లైట్లు లేని కాలంలో కాగడాలతో గుహ అంతా తిప్పి చూపించేవారని అక్కడి వారు చెప్పారు. పైన రైలు కట్ట. కింద గుహ. ఒక్కో గుహ లోపలికి ఇరుకు సందుల్లోంచి వెళ్లాలి. మొత్తం ఐదు గుహలు.
బొర్రా గుహలను 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త 'విలియమ్ కింగ్' కనుగొన్నాడు. బొర్రా అంటే ఒరియా భాషలో 'రంధ్రం' అని అర్ధం. కొండలమీదుగా ప్రవహిస్తున్న గోస్తనీ నదిలోకి వచ్చే అనేక పాయల ప్రవాహం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయని బయట పెద్ద బోర్డు పెట్టిన విషయం గుర్తొచ్చింది. గుహల్లో నీటి ప్రవాహం రాళ్లతో జరిపిన రసాయన చర్యవల్ల రకరకాల ఆకారాలు ఏర్పడ్డడట్టు అర్ధమైంది. మేం వెళ్లిన రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ఒక గుహ నుండి మరో గుహకు వెళ్లే దారి ఇరుకుగా ఉండడంతో కొంత తొక్కిసలాట చోటు చేసుకుంది. కార్తీక మాసంలో ఇటువంటి రద్దీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ గుహల్లోనే 'జగదేకవీరుడు - అతిలోక సుందరి, జంబలకిడి పంబ, శివ' సినిమాల షూటింగ్ జరిగింది. ఆ సినిమాల్లో చూపించిన ప్రాంతాలను ప్రత్యక్షంగా చూడడం భలేగా అనిపించింది. 1990 నుండి పర్యాటక శాఖ ఈ గుహలను నిర్వహిస్తోంది. సంవత్సరానికి 3 లక్షలమందికి పైగా ఈ గుహలను సందర్శిస్తుంటారని గైడ్ చెప్పాడు.
స్వర్గం - నరకం... కటికి వాటర్ ఫాల్స్
తర్వాత ప్రయాణం కటికి వాటర్ ఫాల్స్‌కు. ఆ ప్రాంతానికి ఖచ్చితంగా జీబులోనే వెళ్లాలి. ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లలేం. అడవిలో కొండ దారి. కొండల్లో ప్రవహించే వాగు పక్కనే ప్రయాణం. దారంతా రాళ్లు, గుంటల మయం. జీప్ ఎత్తెత్తి వేస్తుంది. కొంతమంది సాహస యువకులు మోటర్‌సైకిళ్లమీద వస్తున్నారు. ఆ దారిలో జీబు నడిపించే డ్రైవర్లకు హాట్సాఫ్ చెప్పాలనిపించింది. వాటర్ ఫాల్స్ దగ్గరకు చేరడానికి మళ్లీ రైలు కట్ట దగ్గరకు చేరుకున్నాం. కొత్తగా రోడ్డు నిర్మాణం కోసమని ప్రతి వాహనానికి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదీ ప్రయివేటు వ్యక్తులు కాంట్రాక్టుగా నిర్వహిస్తున్నారు. ఇలా కాకుండా ప్రభుత్వమే ఈ పని చేయొచ్చుగా అనిపించింది.
రైలు కట్ట దాటి కాలిబాటనే ప్రయాణం. దాని పక్కనే పట్టలు కట్టిన టీ అంగళ్లు అక్కడక్కడా కనిపించాయి. అక్కడ కొత్తగా బ్యాంబూ చికెన్ చూశాను. వెదురు కణుపులు కత్తిరించి చికెన్ ముక్కలను అందులో కూర్చి మన ఎదురుగానే కాల్చి ఇస్తారు. ఒక్కో బొంగు కణుపు 200 రూపాయలు. వెళ్లే దారిలో 10 బ్యాంబూ చికెన్ కొట్లు ఉన్నాయి.
కాలి బాటనే ప్రయాణం. ఏ మాత్రం స్లిప్ అయినా లోయలో పడిపోతాం. ఇదో పెద్ద సాహస యాత్ర అనిపించింది. ఎదురుగా వాటర్ ఫాల్స్‌కు వెళ్లి తిరిగి వస్తున్నవారు వెళ్లేవారిని అదో రకంగా చూస్తున్నారు. వారిలో ఒకతను ''వెళ్లండి వెళ్లండి. స్వర్గం నరకం రెండూ కనపడతాయి'' అన్నాడు. పైకి వెళ్లేకొద్దీ అసలు విషయం అర్ధమయింది. మరింత ఇరుకు దారిలో జారుతున్న కాలిబాటలో పైకెక్కడంలో ఉంది అసలు నరకం. చూట్టూ ఎప్పుడూ చూడని ప్రకృతి అందాలు, లోయలో జలపాతం... పై నుండి పడుతున్న నీటి తుంపరలు. నడక అలవాటు లేనివాళ్లు మధ్య మధ్యలో ఆగి సేదతీరుతున్నారు. కిలోమీటరు ప్రయాణం తర్వాత వాటర్ ఫాల్స్‌కు చేరుకున్నాం. అప్పటికే అక్కడికి చేరుకున్న వారి కేరింతలతో, పై నుండి పడుతున్న నీటి శబ్దంతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతోంది. నిట్టనిలువు కొండమీద నుండి దూకుతున్న జలపాతం. దానికింద నిలబడి స్నానం చేయడం ప్రత్యేక అనుభూతి. అక్కడి వరకు చేరలేనివారు కిందున్న వాగులో అక్కడిక్కడే స్నానాలు చేస్తున్నారు. అప్పటికే సమయం అయిపోవడంతో తిరుగు ప్రయాణమయ్యాం.
వ్యూ పాయింట్
'కటికి' వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత బొర్రా నుండి అరకు ప్రయాణమయ్యాం. ఘాట్ రోడ్డుమీద జీబు ప్రయాణం. అక్కడక్కడ జరిగిన ప్రమాదాల గురించి డ్రైవర్ చెప్తున్నాడు. 20 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కాఫీ తోటల దగ్గర ఆపాడు. చుట్టూ ఎత్తైన ఫైన్ చెట్లు. వాటి మధ్య కాఫీ తోటలు. కాఫీ గింజల్ని అక్కడే పొడి చేసి అమ్ముతున్నారు. స్పెషల్, ఫ్రెష్ కాఫీ తాగి మళ్లీ బయలుదేరి అరకు ప్రాంతలో ఎత్తైన ప్రాంతానికి చేరుకున్నాం. కొండ మలుపు దగ్గర కింద నిలువుగా లోయ. చూడ్డానికి ఆ లోయ చిన్న కట్టడంలా ఉంది. అదే వ్యూ పాయింట్. ఇక్కడే డ్రైవర్ రాముడు చిత్రంలోని క్లైమాక్స్ చిత్రీకరించారని డ్రైవర్ కమ్ గైడ్ చెప్పాడు. లారీ లోయలో పడ్డ సీను ఎక్కడో చూపించాడు. చీకట్లు కమ్ముకొస్తున్నందున అరకు ప్రయాణం సాగించాం. చీకటి పడే సమయానికి బాగా చలి ప్రారంభమైంది.
చాపరాయి
అరకుకు 10 కిలోమీటర్ల దూరంలో చాపరాయికి బయల్దేరాం. అరకుకు చాపరాయికి మధ్యలో రోడ్డుపక్క చేలో షూటింగ్ జరుగుతుంది. సినిమా షూటింగ్ కోసం అక్కడ ఒకే రంగు పూల పంట వేస్తున్నారు. ప్రముఖ నటులెవ్వరూ షూటింగ్ స్పాట్‌లో లేకపోవడంతో ఆగకుండా వెళ్లిపోయాం. అరకు చుట్టుపక్క ప్రాంతాల్లో నిత్యం షూటింగులు జరుగుతుంటాయని చెప్పారు.
డుంబ్రిగూడ వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఉన్న వాగుకు సంబంధించిన స్పాట్ అది. బండలమీదుగా నీరు ప్రవహించడం అక్కడి ప్రత్యేకత. వాలుగా ఉండడంతో బండపై నుండి నీళ్లు జారుతున్నాయి. ఈమధ్యనే ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేసినట్లుంది. పది రూపాయల టికెట్ కూడా వసూలు చేస్తున్నారు. అలసిపోయిన వారు సేద తీరడానికి తప్ప అంత ప్రాధాన్యత గల స్థలంగా అనిపించలేదు.
అరకులో...
ఎట్టకేలకు మధ్యాహ్నానికి అరకు చేరుకున్నాం. అక్కడ పద్మావతి గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీహౌస్ చూశాం.
పద్మావతీ గార్డెన్
విశాలమైన గార్డెన్‌లా ఎత్తైన ఫైన్ చెట్లు ఆకాశాన్నంటుతున్నాయి. గార్డెన్ తిప్పి చూపించడానికి చిన్న రైలు ఉంది. నడిచైనా తిరగొచ్చు. ఎన్నో రకాల పూల మొక్కలు... ఒక్కో చోట ఒక్కో రకం పెంచుతున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఆకర్షించే విషయం ట్రీ హౌసులు. చెట్టమీద ఇళ్లన్నమాట. చక్కగా పెరిగిన ఎనిమిది చెట్ల ఆధారంగా కట్టిన ఇళ్లు. చెట్లమధ్యలో ఆకాశంలో ఉన్నట్లున్న ఆ ఇళ్లలో ఉండడం ఎప్పటికీ మర్చిపోలేం.
గిరిజన మ్యూజియం
బస్టాండ్ ఎదురుగానే ఉన్న గిరిజన మ్యూజియంను చివరిగా చూశా. గిరిజన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను మ్యూజియం ద్వారా వివరించారు. గిరిజన ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు, సంస్కృతి,వస్తు సముదాయం గురించి వాస్తవ చిత్రాలను చూసి ఆశ్చర్యపోయాం. తీర్చిదిద్దినట్లుగా, నిజమైన మనుషులను చూస్తున్నట్లుగా ఉంది.
మంచి మంచి ప్రదేశాలను చూశామన్న సంతృప్తిని మిగుల్చుకుని అరకు బస్టాండుకు చేరుకుని విశాఖకు ప్రయాణమయ్యాం. పశ్చిమ కనుమల్లోని ఊటీకి ఉన్న ప్రాధాన్యత అరకుకు ఉంది. తూర్పు కనుమల్లోని అరకును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment