ప్రకాశం జిల్లాలోని 1,820 ఎకరాల ఇనుప ఖనిజ నిక్షేపాలు వైజాగ్ స్టీల్‌కు
హైదరాబాద్, మార్చి 16 : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ప్రకాశం జిల్లాలో 1,820 ఎకరాల్లో ఉన్న లోగ్రేడ్ ఇనుప ఖనిజం నిక్షేపాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్ణయించింది. ఇక్కడ మైనింగ్ చేపట్టడంతోపాటు శుద్ధి ప్లాంటు ఏర్పాటుకు వైజాగ్ స్టీల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రతిపాదిత నిక్షేపాలు ప్రకాశం జిల్లాలోని అన్నంగి, వెంపరాల, తమ్మవరం, అద్దంకి, బురెపల్లి, ఎర్రపాలెంలలో 1,820.53 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్టు ఏపీఎండీసీ పేర్కొంది. గతంలో ఈ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ జింపెక్స్ లిమిటెడ్‌కు అప్పగించింది.
ప్రకాశం జిల్లాలోని కొణిజేడు, మర్లపాడు, కందులూరు, యర్రగెర్ల, సర్విరెడ్డిపాలెం, టంగుటూరు గ్రామాల్లో 1,307 ఎకరాల్లో ఉన్న లోగ్రేడ్ నిక్షేపాల అన్వేషణ కోసం ఏపీఎండీసీ 2004 ఆగస్టు 18న ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత జింపెక్స్ లిమిటెడ్‌ను ఎంపిక చేసి, 2005 మార్చి 4న ఆ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. తర్వాత 2009 జూలై 2న మరో 1,820 ఎకరాలను వీటికి అదనంగా జత చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇది ఈవోఐలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఈవోఐలో కేవలం 1,307 ఎకరాలకే టెండర్లు పిలిచారు. కానీ జింపెక్స్‌కు మొత్తం 3,127 ఎకరాలు అప్పగించారు. ఇది బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకు సమాన అవకాశాలు లేకుండా చేయడమేనని ఏపీఎండీసీ వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి ఏపీఎండీసీ ఈ మొత్తాన్ని ఈవోఐలో పేర్కొని ఉంటే కార్పొరేషన్‌కు మరింత మంచి ఆఫర్‌లు వచ్చుండేవని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 2009 జూలై 2న ఏపీఎండీసీ-జింపెక్స్‌ల మధ్య జరిగిన అదనపు ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ రద్దు చేసిన 1,820 ఎకరాలను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్)కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ కేటాయింపులకు సంబంధించి ఈక్విటీ భాగస్వామ్యం ఏపీఎండీసీకి చెల్లించాల్సిన మొత్తం తదితర అంశాల ఖరారుకు ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ను కన్సల్టెంట్‌గా నియమించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఏపీఎండీసీ ఎం.డి ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ప్రకాశం జిల్లాలోని లోగ్రేడ్ ఇనుప ఖనిజం నిక్షేపాలను వైజాగ్ స్టీల్‌కు అప్పగిస్తారు.
No comments:
Post a Comment