Tuesday, September 24, 2013

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-ఉధృతంగా పన్నుల నిరాకరణోద్యమం!

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-ఉధృతంగా పన్నుల నిరాకరణోద్యమం!

ఉధృతంగా పన్నుల నిరాకరణోద్యమం!

దేశవ్యాపిత పిలుపు మేరకు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా జరిగిన పన్నుల నిరాకరణోద్యమంలో పర్చూరు, చిన్నగంజాం, దుద్దుకూరు ఫిర్కాలు ప్రముఖ పాత్ర వహించి దేశవ్యాపిత గుర్తింపును సాధించాయి.
1921లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటి స్వాతంత్య్ర సాధనకు '' పన్నుల నిరాకరణోద్యమం'' కు పిలుపు నిచ్చింది. ఈ పిలుపు పెదనందిపాడు ఏరియాలో ఉధృతంగా సాగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని పై మూడు ఫిర్కాలలో తీవ్రస్థాయిలో నిర్వహించారు.
భూమిశిస్తు, నీటి తీరువా పెంపునకు నిరసనగా రైతాంగం పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొంది. పెదనందిపాడుకు చెందిన పర్వనేని వీరయ్య దీనికి నాయకత్వం వహించారు. గ్రామాల్లో పెద్దరైతులే ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నారు. నాలుగు వేల మంది వాలంటీర్లతో శాంతిసేన ఈ కార్యక్రమం జయప్రదం కోసం ఏర్పరచారు. వీరు ఒక గ్రామం నుండి మరొక గ్రామం కాలినడకన ఉధృతమైన ప్రచారం నిర్వహించారు. శిస్తు వసూళ్లు జరగకుండా సహాయ నిరాకరణ కార్యక్రమం జయప్రదంగా జరిగేందుకు కృషి చేశారు. ఉద్యమం 80 గ్రామాలకు విస్తరించింది.
గ్రామాధికారుల రాజీనామా
సహాయ నిరాకరణకు మద్దతుగా దుద్దుకూరు, పర్చూరు, చిన్నగంజాం ఫిర్కాలలోని గ్రామాధికారులు రాజీనామా చేశారు. రాచపూడి గ్రామాధికారి రాచపూడి గోవర్దనరావు, కొణికికి చెందిన అబ్బరాజు సుబ్బరాయుడు, తమ్మవరానికి చెందిన తమ్మవరపు లక్ష్మీనారాయణ, దుద్దుకూరు గ్రామకరణం దుద్దుకూరు శ్రీకృష్ణమూర్తితో పాటు మొత్తం 29 మంది గ్రామాధికారులు రాజీనామా చేసి సహాయ నిరాకరణోద్యమానికి నాయకత్వం వహించారు.
విస్తృత ప్రజామద్దతు-అణచివేత ప్రయత్నాలు
ఉద్యమం సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలకు పెద్దయుద్ధ్దమే జరిగింది. ప్రజలు పన్నూలు చెల్లించటానికి నిరాకరించారు. గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దీంతో గ్రామాలకు వచ్చె అధికార్లందరికీ సహకరించె వారెవరూ లేకుండా పోయారు. ప్రభుత్వం ప్రత్యేక అధికార్లను నియమించి ''ఆస్తుల జప్తుకు'' నిర్బంధంగా ప్రయత్నం చేసింది. దుద్దుకూరు, ఈదుమూడి గ్రామాల్లో శాంతిసేన వాలంటీర్లు ''జప్తు నుండి తప్పించు కోవటం కోసం ఇళ్లల్లో డబ్బులుగానీ, విలువైన ఆభరణాలు గానీ లేకుండా చూడాలని ఇల్లిల్లూ తిరిగి ప్రచారం నిర్వహించారు.
సబ్‌కలక్షన్‌ హైదరీ, తాహశీల్దార్‌ పిల్లల మర్రి సోమయాజులు దుద్దుకూరు గ్రామాల్లో చేదు అనుభవం చవిచూశారు. తాగేందుకు మంచినీరు సైతం సంపాదించుకోలేకపోయారు. వైశ్యులు నిత్యావసర సరుకులు అమ్మటానికి నిరాకరించారు. పన్నుల నిరాకరణోద్యమం విశ్ఛిన్నం చేయటానికి నియమించిన స్పెషల్‌ కలెక్షన్‌ '' రూధర్‌ ఫర్డ్‌'' గ్రామాల పర్యటనలో ఎవరూ సహకరించలేదు. కనీసం గ్రామం పేరేమిటో చెప్పే వారు కరువయ్యారు. జప్తు చేసిన ధాన్యం అధికార్లే మోసుకోవలసి వచ్చింది.
పట్టుదలగా నిలబడ్డ రైతులు
ఒంగోలు సబ్‌కలెక్టర్‌ ముప్పాళ్ల మద్దిరాల వెళ్లి జప్తు చేసిన ట్రంకు పెట్టెను బండిలో వేసుకొని దుద్దుకూరు వెళ్లే ప్రయత్నాన్ని చిగురుపాటి చిన్నమ్మ అనే రైతు మహిళ అడ్డుకుంది. బండికి అడ్డం పడుకుంది. చివరకు సబ్‌కలెక్టర్‌ పెట్టె వదిలి వెళ్లాడు.
అద్దంకి కాకానిపాలెంలో తహశీల్దార్‌ సోమయజులు కోట సుందరమ్మ మెడలో తాళిబొట్టు లాక్కునే ప్రయత్నం చేశారు. దాన్ని ప్రతిఘటించింది.
ప్రజలను గందరగోళ పరిచి లొంగదీసుకోవటం కోసం ఎన్నో మార్గాలను అధికారులు అవలంభించారు. దుద్దుకూరు గ్రామంలో తహశీల్దార్‌ సోమయాజులు తాగుడుకు బానిసయిన ముగ్గురు రైతులను తన వద్దకు పిలిపించుకొని తానే డబ్బు ఇచ్చాడు. పన్ను చెల్లించిన రశీదులు వారి చేతిలో పెట్టాడు. వారే స్వచ్ఛందంగా వచ్చి పన్నులు కట్టారని ఊరంతా ప్రచారం చేశారు. గ్రామస్తుల మనోధైర్యం చెడగొట్టె ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఉద్యమ విరమణ
దాదాపు 80 గ్రామాల్లో సంపూర్ణంగా, పట్టుదలగా సాగుతున్న పన్నుల నిరాకరణక్షద్యమం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పోరాటంగా ముందుకు వచ్చింది. ఉద్యమంలో భాగంగా పన్నుల నిరాకరణతో పాటు అంటరానితనంపై పోరాటం, ఖాదీ ప్రచారం ఉద్యమంతో కలిసి ముందుకు సాగాయి.
1922 ఫిబ్రవరి 11 సమావేశమయిన జిల్లా కాంగ్రెస్‌ కమిటి గాంధీ సలహ మేరకు ఉద్యమాన్ని అకారణంగా నిలిపివేయాలని నిర్ణయించింది. అనేక గ్రామాలలో ఈ నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. నెల రోజులపాటు ప్రజలు తమ కళ్లెదురుగానే తమ పశువుల, భూములు, ధాన్యం, పాత్రలు జప్తు చేశారు. వేలం వేశారు. పోలీసుల చేతుల్లో మిలటీరీ చేతుల్లో ఎన్నో అవమానాలు భరించారు. నిస్వార్ధంగా పని చేస్తున్న ఎంతో మంది కార్యకర్తలు జైళ్లకు వెళ్లారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు.
ఉద్యమం మహోధృతంగా సాగుతున్న సమయంలో నాయకులే ఉద్యమాన్ని ఆపి వేయాలని పిలుపునిచ్చి ఉద్యమాన్ని దిగజార్చారు. పెదనందిపాడు ప్రాంతంలో జరిగిన ఈ ఉద్యమాన్ని దేశ వ్యాపిత ఉద్యమంగా అఖిలభారత కాంగ్రెస్‌ కమిటి మార్చుతుందని అనుకున్న వారికి నిరాసే ఎదురయ్యింది. ఆ విధంగా కాంగ్రెస్‌ పార్టీ తన భూర్జువా వర్గ స్వభావం రీత్య పాలకులతో కుమ్మక్కైయ్యారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో అటువంటి నిర్ణయాలే తీసుకున్నారు.
ఏమైనా భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం ప్రజలకు ఉత్తేజపరచింది. ఆ పోరాటంలో ఇప్పటి ప్రకాశం జిల్లా భాగమైన పర్చూరు, అద్దంకి, దుద్దుకూరు ప్రాంతంలో ఉధృతమైన పోరాటాలు జరగటం జిల్లా ప్రజలకు స్ఫూర్తి దాయకం.

No comments:

Post a Comment