"వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 93 శాతం మేరకు తయారీ, ఉత్పత్తి రంగాలకే ఉండటం వల్ల ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియాకు విశేష స్పందన వచ్చినట్లుగా భావించవచ్చు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాలతో బాటు ఆటోమెబైల్ రంగాలకు కూడా పెట్టుబడులు వచ్చాయి. 2015-16 సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 55.46 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర తరలి వచ్చాయి. 2022 నాటికి జాతీయ స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగ ఉత్పత్తులు 25 శాతానికి పెరగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగ ఉత్పత్తులు 17 శాతం మేరకు చేరుకోవడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత మేలిమి నిర్ణయాన్ని విపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించారో...! "
ఆర్ధిక సంస్కరణల వేగం మందగించినందున దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం లేదని చాలా కాలం నుంచి విదేశీ పెట్టుబడిదారులు సణుగుతున్నారట. ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్లినా ఇదే విషయం అడుగుతున్నారట. ఈ నేపథ్యంలోనే విదేశీ పెట్టుబడులకు పరిమితులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నదట. రక్షణ, విమాన యాన రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే నిర్ణయం తీసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ఇది. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే స్వదేశంలోని చిన్న వ్యాపారులు నాశనమైపోతారని, నిరుద్యోగిత పెరిగిపోతుందని వాదించిన వారు ఇప్పుడు ఆ రంగంలో విదేశీ పెట్టుబడులకు సై అంటున్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు గేట్లు తీస్తే అనర్ధాలు జరుగుతాయని, స్వదేశీ కంపెనీలు ఆ పోటీని తట్టుకోలేక మూతపడతాయని ఘోషించిన పెద్దలు అలాంటిదేం లేదని ఇప్పుడు చెబుతున్నారు. రక్షణ రంగం అనేది అత్యంత గోప్యత పాటించాల్సిన రంగమని అందులో విదేశీ పెట్టుబడులు ఎలా అనుమతిస్తారని గతంలో యుపిఏ ప్రభుత్వాన్ని నిలదీసిన వారు ఇప్పుడు రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు అత్యంత అవసరమని చెబుతున్నారు. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే విదేశీ పెట్టుబడులకు గేట్లు ఎత్తాల్సిందేనని చెప్పడం అందుకు అనుగుణంగా ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగిపోతున్నది.
రక్షణ సహా అన్ని కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నూటికి నూరు శాతం అనుమతిస్తూ ఎఫ్‌డీఐల విధానాన్ని అత్యంత విస్తృతమైన పరిధిలో కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. రక్షణ, పౌర విమానయానం, ఆహారోత్పత్తి, ఫార్మా, పశు సంవర్ధకం, నిర్మాణ తదితర రంగాల్లో నూటికి నూరుశాతం విదేశీ పెట్టుబడులకు తలుపులను బార్లా తెరిచింది. భారత దేశం అత్యంత పారదర్శక మైన బహిరంగ ఆర్థిక వ్యవస్థ అని ప్రపంచానికి చెప్పేందుకే ఈ నిర్ణయం తీసు కున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఉపాధి కల్పన, ఉద్యోగ సృష్టి కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను పెద్ద ఎత్తున సరళీకృతం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎన్‌డిఏ ప్రభుత్వం 2015లో మొదటి సారి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను సరళీకృతం చేయటం ప్రారంభించింది. యుపిఏ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇదే భారతీయ జనతా పార్టీ మూడో దశ ఆర్ధిక సంస్కరణల పేరుతో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తే ఊరుకునేది లేదని చెప్పిన విషయం కూడా మరచిపోలేం. అధికారంలో లేకపోతే ఒకలా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించడం తప్పు కాదని బహుశ భారతీయ జనతా పార్టీ అభిప్రాయం కావచ్చు. బీమారంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని పెంచే అంశం 2008 నుంచి కూడా పెండింగ్‌లో ఉండగా అప్పట్లో విపక్షంలో ఉన్న బీజేపీ దాన్ని వ్యతిరేకించి అడ్డుకుంది.బిజెపి ఆ తర్వాతి కాలంలో బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచింది. ఇప్పటి వరకు ఏకఛత్రం కింద సాగిన రైల్వేల్లో ప్రయివేటు పెట్టుబడులకు తెరతీసే విధంగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రైల్వేల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులను నూటికి నూరు శాతం అనుమతించారు.
ఎన్‌డిఏ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మూలంగా కొన్ని ఎంపిక చేసిన రంగాలు మినహా మిగతా అత్యధిక రంగాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆటోమెటిక్ అనుమతుల విధానంలోకి వస్తాయి. ఎఫ్‌డిఐల విధానాన్ని అత్యంత సరళీకృతం చేయటంతో భారతదేశం ఇప్పుడు దాదాపుగా పూర్తిస్థాయి బహిరంగ ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి వచ్చినట్లయింది. ఎన్‌డిఏ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి రక్షణ, నిర్మాణం, బీమా, పెన్షన్ రంగం, ప్రసారరంగం, టీ, కాఫీ, రబ్బర్, కార్డిమమ్, పాం ఆయిల్, ఆలీవ్ ఆయిల్ ట్రీ ప్లాంటేషన్, సింగిల్ బ్రాండ్ రిటేల్ ట్రేడింగ్, ఉత్పాదక రంగం, పరిమిత బాధ్యత భాగస్వామ్యం, పౌర విమానయానం, ఉపగ్రహ సంస్థలు, ఆస్తుల పునర్ వ్యవస్థీకరణ సంస్థల రంగాల్లో ఎన్నో సంస్కరణలు చేయటంతోపాటు ఆర్థిక విధానాలను సరళీకృతం చేసింది.కొత్త విధానం ప్రకారం విదేశీ విమానయాన సంస్థలు మినహా మిగతా సంస్థల్లో నూరుశాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తారు. గతంలో కేవలం 49 శాతం మాత్రమే ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించేవారు. అంతకు మించి పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. రక్షణ రంగంలో ఇప్పటి వరకు ఉన్న ఆధునిక టెక్నాలజీ అన్న నియమాన్ని సవరించి ఆధునిక లేక ఇతర కారణాలు అంటూ సవరించారు. తద్వారా నూరు శాతం పెట్టుబడులకు అనుమతిచ్చారు. బ్రాడ్ క్యాస్టింగ్ క్యారేజీ సర్వీసుల రంగం ప్రవేశ విధానాన్ని పున:సమీక్షిస్తారు. ఆహారోత్పత్తి, ఫార్మా రంగంలో కూడా 100 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తారు. ప్రైవేట్ భద్రత సంస్థల్లో ఎఫ్.డి.ఐని అటోమెటిక్ రూట్‌లో 49 శాతం, ప్రభుత్వ అనుమతితో 74 శాతాన్ని అనుమతిస్తారు. శాఖా కార్యాలయాలు, లైజనింగ్ కార్యాలయాలు, ప్రాజెక్టు కార్యాలయాల ఏర్పాటుకు కూడా అనుమతి మంజూరు చేస్తారు. 100 శాతం ఎఫ్‌డిఐని అనుమతిస్తున్న పశు సంవర్థక శాఖలో ఇక మీదట కంట్రోల్డ్ కండీషన్స్ విధానాన్ని తొలగిస్తారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రానున్న రోజుల్లో విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అంచనా వేస్తున్నది. 2013-14 సంవత్సరంతో పోలిస్తే 2014-15వ సంవత్సరంలో ఎఫ్‌డిఐలు 27 శాతం మేరకు పెరుగుదల చూపాయి. వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 93 శాతం మేరకు తయారీ, ఉత్పత్తి రంగాలకే ఉండటం వల్ల ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియాకు విశేష స్పందన వచ్చినట్లుగా భావించవచ్చు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాలతో బాటు ఆటోమెబైల్ రంగాలకు కూడా పెట్టుబడులు వచ్చాయి. 2015-16 సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 55.46 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర తరలి వచ్చాయి. 2022 నాటికి జాతీయ స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగ ఉత్పత్తులు 25 శాతానికి పెరగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగ ఉత్పత్తులు 17 శాతం మేరకు చేరుకోవడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత మేలిమి నిర్ణయాన్ని విపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించారో...!
No comments:
Post a Comment